: భార్యను కలిసేందుకు వచ్చిన ‘లష్కరే’ కమాండర్.. సైన్యం చేతిలో హతం!
జమ్మూకాశ్మీర్ లోని తన భార్యను కలిసేందుకు రహస్యంగా వచ్చిన లష్కరే తోయిబా కమాండర్ దుజానాను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా హక్రిపోరా గ్రామంలోని ఓ ఇంటికి తన భార్యను కలిసేందుకు దుజానా వచ్చిన సమాచారం భద్రతా బలగాలకు అందింది. దుజానాతో పాటు అతడి సన్నిహితుడు అరిఫ్ లిల్హారి, మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఆ ఇంట్లో నక్కి ఉన్నారు. తన భార్యను కలిసేందుకు దుజానా వెళ్లిన రెండు గంటల తర్వాత ఆ ఇంటిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అనంతరం, ఇంటిపైకి కాల్పులు జరపగా, ఉగ్రవాదులు కూడా ఎదురు కాల్పులకు పాల్పడ్డాడు. అయితే, ఎన్ కౌంటర్ జరిగే సమయంలో అక్కడికి చేరుకున్న సుమారు వంద మందికి పైగా ఆందోళనకారులు భద్రతా బలగాలపైకి రాళ్లు రువ్వారు. దీంతో, వారిపైకి భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. పలువురు గాయపడ్డారు. ఈ క్రమంలో అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించిన దుజానాను భద్రతా బలగాలు కాల్చిపారేశాయి.
ఈ సందర్భంగా సంబంధిత పోలీస్ అధికారులు మాట్లాడుతూ, దుజానాను మట్టుబెట్టిన నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు జమ్మూకాశ్మీర్ లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశామని, కాశ్మీర్ లోయలోని పలు పాఠశాలలు, కళాశాలలను మూసివేశామని చెప్పారు. తదుపరి ఆదేశాలు అందేవరకూ, మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించబోమని చెప్పారు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ కు చెందిన దుజానా, కాశ్మీర్ లో లష్కరే తోయిబా కార్యకలాపాలకు చీఫ్ గా వ్యవహరిస్తున్నాడని, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అని, అతనిపై లక్షల్లో రివార్డు ఉన్నట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.