: ఎంత అద్భుతం... ఔరంగాబాదీలు నా రాక గురించి ముందే తెలుసుకున్నారు: తస్లిమా నస్రీన్
వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్, ఔరంగాబాద్ కు వచ్చిన వేళ, ఆల్ ఇండియా మజ్లిస్ - ఏ - ఇతెహాదుల్ ముస్లిమీన్ కార్యకర్తలు తీవ్ర నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. ఆమెను తమ నగరంలోకి అనుమతించేది లేదని వారు ఆందోళనలు చేయగా, వాటిపై తస్లిమా స్పందించారు. తన ఔరంగాబాద్ పర్యటన గురించి కేవలం పోలీసులకు మాత్రమే సమాచారాన్ని ఇచ్చానని, తన ప్రయాణ వివరాలు ఔరంగాబాదీలకు తెలిసిపోవడం ఎంతో అద్భుతంగా తోస్తోందని అన్నారు.
పోలీసు వర్గాలే తన రాక గురించి నిరసనకారులకు సమాచారాన్ని ఇచ్చి వుంటాయని ఆమె ఆరోపించారు. తన కదలికలకు సంబంధించిన ప్రతి విషయమూ బయటకు ఎలా పొక్కిందో అర్థం కావడం లేదని తన ట్విట్టర్ ఖాతాలో ఆమె వ్యాఖ్యానించారు. అజంతా, ఎల్లోరా గుహలను సందర్శించాలన్నది తన కలని, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో తన కోరిక తీరక పోవడాన్ని నమ్మలేకున్నానని అన్నారు. కాగా, బంగ్లాదేశ్ లో పుట్టి, అక్కడి ముస్లిం సంఘాలతో బహిష్కరణకు గురైన తస్లిమా, ప్రస్తుతం స్వీడన్ పౌరసత్వంతో గడుపుతున్న సంగతి తెలిసిందే.