: చంద్రబాబుపై కసి తీర్చుకునేందుకు ఇదే మంచి ఛాన్స్: భూమన కరుణాకర్ రెడ్డి
ఆరు కోట్ల మంది ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ద్రోహం చేశారని... ఆయన చేసిన మోసానికి కసి తీర్చుకునే అవకాశం ఇప్పుడు నంద్యాల ప్రజలకు వచ్చిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పనున్నారని అన్నారు. జగన్ కు తొలి కానుకగా నంద్యాలను ప్రజలు ఇవ్వనున్నారని చెప్పారు. మాయమాటలతో నంద్యాల ప్రజలను టీడీపీ నేతలు మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి, మంత్రులంతా నంద్యాలలోనే మకాం వేశారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
తమిళనాడు ఆర్కే నగర్ కంటే నంద్యాల దారుణంగా మారిందని భూమన విమర్శించారు. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఎవరి ఇంటికి వెళ్లినా డబ్బు దొరుకుతుందని అన్నారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ, దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి డబ్బుతో ఎన్నికలో గెలవాలని టీడీపీ యత్నిస్తోందని అన్నారు. మంత్రులు సైతం తమ స్థాయిని మరచి, వీధి రౌడీల్లా మారిపోయారని చెప్పారు.