: మిథాలికి బీఎండబ్ల్యూ కారును బహూకరించిన చాముండి!
టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి చాముండేశ్వరినాథ్ బీఎండబ్ల్యూ (320 డీ) కారును బహూకరించారు. ఈ రోజు హైదరాబాదులోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో మిథాలికి చాముండి ఈ కారును అందజేశారు.
ఈ సందర్భంగా మిథాలీరాజ్ మాట్లాడుతూ, దేశంలోని క్రీడాకారులను చాముండేశ్వరినాథ్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని కొనియాడింది. మహిళా క్రికెట్ కు దేశంలో ఆదరణ ఎంతగానో పెరిగిందని తెలిపింది. తన జోరును ఇకపై కూడా ఇలాగే కొనసాగిస్తానని చెప్పింది. తనను ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలిపింది.
కాగా, గోపీచంద్ అకాడమీకి తాను తొలిసారి వచ్చానని... ఎంతో మంది గొప్ప బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఆయన మన దేశానికి అందించారని ప్రశంసించింది. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ, ప్రపంచ కప్ టోర్నీలో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన మహిళా క్రికెటర్లపై ప్రశంసలు కురిపించారు. జట్టును మిథాలీరాజ్ చాలా అద్భుతంగా నడిపించిందని కితాబిచ్చాడు. క్రీడాకారులకు మిథాలి వంటి వారు ఆదర్శం కాగలరని చెప్పాడు.