: బీజేపీ ఎంపీలపై అమిత్ షా తీవ్ర ఆగ్రహం!


ఈ ఉదయం బీజేపీ ఎంపీల సమావేశం జరుగగా, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎంపీల వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటు కార్యక్రమాలకు డుమ్మా కొట్టే విషయంలో మిగతా పార్టీలతో పోలిస్తే బీజేపీ ఎంపీలే ముందున్నారని గుర్తు చేసిన ఆయన, పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు. సోమవారం నాడు వెనుకబడిన తరగతుల బిల్లు రాజ్యసభకు వచ్చిన వేళ, ఆ బిల్లు ఆమోదం కోసం ఓటింగ్ జరుగగా, బీజేపీ కొంత ఇబ్బంది పడి అతి కష్టంమీద గట్టెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంపీలందరూ హాజరైతే, ఈ పరిస్థితి ఉండేది కాదని, పార్లమెంటులో తమ సమస్యలపై గళం విప్పుతారన్న ఆశతోనే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అమిత్ షా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.

ఇక నిన్న రాజ్యసభకు హాజరు కాని ఎంపీలతో విడివిడిగా మాట్లాడిన అమిత్ షా, వారి గైర్హాజరుకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, బీజేపీ ఎంపీలు అధినేతలతో చివాట్లు తినడం ఇదే తొలిసారి కాదు. గత వారంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం, లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు జరుగుతున్న వేళ, ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందేనని, అత్యవసరమైతే తప్ప, ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లాలంటే, నిత్యమూ సభ్యులంతా సభకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా, నిన్న ఐదుగురు మంత్రులు సహా, మొత్తం 30 మంది ఎన్డీయే ఎంపీలు పార్లమెంటుకు హాజరు కాలేదు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన కాంగ్రెస్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు బిల్లుపై ఓటింగ్ కు పట్టుబట్టింది. బిల్లుకు అనుకూలంగా 74, వ్యతిరేకంగా 52 ఓట్లు రావడంతో గట్టెక్కింది.

  • Loading...

More Telugu News