: సూపర్ లీగ్ టీ20కి దూరమైన స్టార్ బ్యాట్స్ ఉమన్ హర్మన్ ప్రీత్!
టీమిండియా స్టార్ బ్యాట్స్ ఉమన్ హర్మన్ ప్రీత్ కౌర్ కియా సూపర్ లీగ్ టీ20 టోర్నీ నుంచి తప్పుకుంది. మహిళల ప్రపంచ కప్ టోర్నీ సమయంలోనే ఆమె భుజం నొప్పితో బాధ పడింది. ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్స్ లో ఆమె ఆడుతుందో? లేదో? అనే సందేహం కూడా అప్పట్లో వచ్చింది. ఈ నేపథ్యంలో, ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఆమె స్కానింగ్ చేయించుకుంది. ఈ క్రమంలో, ఓ నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. దీంతో, ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కియో సూపర్ లీగ్ టీ20కి ఆమె దూరమైంది. ప్రస్తుతం సర్రె స్టార్స్ జట్టుకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియాపై జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో చెలరేగిపోయిన హర్మన్ ప్రీత్.... ఏకంగా 171 పరుగులతో అజేయంగా నిలిచింది.