: వీడిన విక్రమ్ గౌడ్ పై కాల్పుల మిస్టరీ... అసలేం జరిగిందంటే..!


హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసులో మిస్టరీ వీడింది. విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసుకోవాలని భావించాడని, తనను తాను కాల్చుకునే ధైర్యం చేయలేక, సుపారీ ఇచ్చి అనంతపురంకు చెందిన కిరాయి గూండాలను నియమించుకున్నాడని, అప్పులు, ఆర్థిక బాధల నుంచి తాత్కాలికంగానైనా బయటపడాలన్న ఉద్దేశమే ఆయనతో ఈ పని చేయించిందని పోలీసులు తేల్చారు. సుపారీ ఇచ్చి కాల్పించుకున్నానని విక్రమ్ గౌడ్ విచారణలో వెల్లడించాడని పేర్కొన్న పోలీసులు, కాల్పులు జరిపిన ఇద్దరు యువకులనూ అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

కాల్పుల డ్రామా అంతా విక్రమ్ డైరెక్షన్ లోనే సాగిందని, ఘటనకు ముందు నిందితులతో ఆయన మాట్లాడిన ఫోన్ కాల్ కీలకమైన క్లూలను అందించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇక ఆత్మహత్యాయత్నంతో పాటు పోలీసులను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేసిన విక్రమ్, ఆయన భార్య షిఫాలీలపై కేసులు నమోదు చేయనున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక నేడు బంజారాహిల్స్ పోలీసుల చేతికి రానుంది. ఆత్మహత్యాయత్నాన్ని హత్యాయత్నంగా మార్చేందుకు విక్రమ్ పథకం పన్నాడని, ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు పరిశీలించిన మీదట... తొలుతే తమకు ఈ కేసుపై అనుమానాలు వచ్చాయని చెప్పిన పోలీసులు, ఫోన్ కాల్స్, సీసీటీవీ ఫుటేజ్ ల విశ్లేషణ తరువాత గట్టిగా ప్రశ్నిస్తే, విక్రమ్ నిజం ఒప్పుకున్నడని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News