: మైదానంలోనే మూత్ర విసర్జన చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు!.. అడ్డంగా దొరికిన వైనం.. ఫొటో వైరల్!
మైదానంలో ప్రత్యర్థి జట్టుతో హోరాహోరీగా తలపడుతున్న సమయంలో ప్రకృతి పిలిచిందో ఆటగాడిని. అంతే.. అక్కడెవరున్నారో, తామెక్కడున్నామో మరచిపోయిన సదరు ఆటగాడు మైదానం బౌండరీలైన్ వద్దకు వెళ్లి పని కానిచ్చేశాడు. ఆ పక్కనుంచి అమ్మాయి వెళ్తోందన్న సంగతిని కానీ, కెమెరా ఫ్లాష్ లైట్లు తనను లక్ష్యంగా చేసుకున్నాయన్న సంగతిని కానీ పట్టించుకోకుండా మూత్ర విసర్జన చేసేశాడు.
ఉక్రేనియా రాజధాని కీవ్‌లో జరిగిందీ ఘటన. యూఈఎఫ్ఏ యూరోపా లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఒలింపిక్ గోనెటెస్క్, పీఏఓకే జట్లు తలపడుతుండగా పీఏఓకే ఆటగాడు ఈ పనిచేశాడు. ఆ సమయంలో ఆ ఆటగాడిని ఫొటో తీసిన ఉక్రేనియన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గుబాన్ ఇల్యా దానిని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ‘‘నన్ను క్షమించండి ఫ్రెండ్స్, కానీ ఈ పని మాత్రం హర్షించదగినది కాదు, ఈ కంపు నన్ను జీవితాంతం వెంటాడుతుంది’’ అని ఫోటోకు క్యాప్షన్ రాశాడు. కాగా, మైదానాన్ని పాడుచేసిన ఆ ఆటగాడిని 23 ఏళ్ల మిడ్‌ఫీల్డర్ దిమిత్రిస్ పెల్కాస్‌గా మీడియా పేర్కొంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 1-1 గోల్స్‌తో సమానంగా నిలిచాయి.