: అన్నం వండే ప్రదేశంలో ఆ పనిచేయలేరట కానీ, అది పండే ప్రదేశంలో చేస్తారట!: బహిరంగ మలవిసర్జనపై బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విసుర్లు
దేశంలో మరుగుదొడ్డి గురించి మాట్లాడడం ఇంకా నిషిద్ధ అంశంగానే మిగిలిపోయిందని బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన రాబోయే చిత్రం ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’ సినిమా గురించి మాట్లాడుతూ.. మరుగుదొడ్డి ప్రధానాంశంగా సాగే ఈ సినిమా దాని ఆవశ్యకతను నొక్కి చెబుతుందని పేర్కొన్నాడు. ప్రజల ఆలోచనా విధానాన్ని ఈ సినిమా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇప్పటి వరకు మరుగుదొడ్డి గురించి మాట్లాడుకోవడాన్ని తప్పుగా భావించేవారని, కానీ యువత ఇప్పుడిప్పుడే దీనిపై మాట్లాడుకుంటున్నారని అక్షయ్ పేర్కొన్నాడు. ఇది చాలా గొప్ప విషయమని, మరుగుదొడ్డిపై అవగాహన ఏర్పడుతోందని అన్నాడు. తాను కలిసిన చాలామంది చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయినట్టు చెప్పాడు. వంట చేసుకునే దగ్గర ఆ పని (మల విసర్జన) చేయలేమని చెప్పారని, కానీ మనం తినే ఆహార పదార్థాలు పండే ప్రదేశంలో ఆ పని ఎలా చేయగలుగుతున్నారని ప్రశ్నించాడు. బహిరంగ మరుగుదొడ్లను కట్టించడం ద్వారా ప్రభుత్వం కొంతవరకే చేయగలదని, ఆ తర్వాత పనిని మాత్రం ప్రజలే చేయాలని పిలుపునిచ్చాడు. కాగా, శ్రీనారాయణ్ సింగ్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, హూమి పెడ్నేకర్ నటించిన ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.