: కుమారుణ్ని కిడ్నాప్ చేసినందుకు ప్రతిగా... కిడ్నాపర్ తల్లిదండ్రులను కిడ్నాప్ చేశాడు!
తన కొడుకును కిడ్నాప్ చేసినందుకు సినీ ఫక్కీలో మరో కిడ్నాప్ చేసి పగ తీర్చుకుంటున్నాడీ తండ్రి. మధ్యప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ సంతు సింగ్ కుమారుడు విజయ్‌ని బబ్లీ కోల్ అనే దోపిడీ దొంగ కిడ్నాప్ చేశాడు. విజయ్‌ని వదిలేయాలంటే రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు ప్రతిగా బబ్లీ కోల్ తల్లిదండ్రులను సంతు సింగ్ కిడ్నాప్ చేయించి, తన కుమారునికి చిన్న గాయం తగిలినా కిడ్నాపర్ తల్లిదండ్రులనూ గాయపరుస్తానని, 24 గంటల్లో విజయ్‌ని వదిలేయాలని బెదిరించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ ఆరోపణల్లో నిజం లేదని, కాకపోతే తన కుమారుడు ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు తెలిసిందని సంతు సింగ్ మీడియాకు చెప్పాడు. దోపిడీ దొంగ కుటుంబీకులు మధ్యప్రదేశ్ నుంచి వెళ్లిపోయారని, అంతే తప్ప వాళ్లనెవరూ కిడ్నాప్ చేయలేదని, అందుకు మద్దతునిచ్చే ఆధారాలేవీ దొరకలేదని పోలీసులు తెలిపారు.