: ముస్లిం మంత్రి నోట `జై శ్రీరాం` .... తర్వాత క్షమాపణలు చెప్పిన మంత్రి!
తమ నేత తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆనందంలో ఓ ముస్లిం మంత్రి `జై శ్రీరాం` అంటూ చేసిన నినాదాలను ముస్లిం మత పెద్దలు తప్పుబట్టారు. ఆయన్ని ఇస్లాం నుంచి బహిష్కరిస్తూ ఫత్వా జారీ చేశారు. ఇక చేసేది లేక సదరు మంత్రి క్షమాపణలు కోరారు. బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా చేసి భాజపా మద్దతుతో తిరిగి ముఖ్యమంత్రి ఎన్నికైన సందర్భంగా జేడీ(యూ)కి చెందిన ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ అందరితో కలిసి `జై శ్రీరాం` అంటూ నినాదాలు చేశారు.
అంతేకాకుండా హిందువులు చేతికి వేసుకునే కంకణాలను ధరించి మీడియాకు చూపించారు. ప్రజల మంచి కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమని చెప్పారు. నితీశ్ మంత్రి వర్గంలో ఖుర్షీద్కి మైనారిటీ శాఖ మంత్రిగా పదవి దక్కింది. కానీ ఈయన చేతలను ముస్లిం మత పెద్దలు తప్పుబడుతూ తీవ్రంగా విమర్శించారు. ఈ సమస్యను జటిలం చేయడం ఇష్టం లేక ముఖ్యమంత్రి నితీశ్ సలహామేరకు ఖుర్షీద్ క్షమాపణలు తెలిపారు.