: ఇకపై ప్రతి నెలా రూ. 4 పెరగనున్న వంటగ్యాస్ ధర!
వంటగ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని వీలైనంత త్వరగా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం బాగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి సబ్సిడీపై ఇస్తున్న వంటగ్యాస్ ధరను ప్రతి నెలా రూ. 4 పెంచాలని ఇంధన సంస్థలను ఆదేశించింది. ఈ విషయాన్ని లోక్‌సభలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. `గతేడాది చెప్పినట్లుగా 14.2 కేజీల సిలిండర్‌పై ప్రతి నెలా రూ. 2 కాకుండా రూ. 4 పెంచాలని ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలను ఆదేశించాం. ఇలా చేస్తూ వచ్చే ఏడాది మార్చి నాటికి వంటగ్యాస్‌పై సబ్సిడీని పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాం` అని ప్రధాన్ తెలిపారు.
గతంలో వస్తు సేవల పన్ను కాకుండా 14.2 కేజీల సిలిండర్‌పై ప్రతి నెలా రూ. 2 చొప్పున పెంచేవారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రతి నెలా రూ. 4 పెంచనున్నారు. వంటగ్యాస్‌పై సబ్సిడీ తొలగిపోయేంతవరకు ఇలా పెంచుతూనే ఉంటామని మంత్రి ప్రధాన్ చెప్పారు. ప్రస్తుతం సబ్సిడీ కింద సంవత్సరానికి 12 సిలిండర్లు ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ కావాలంటే మార్కెట్ ధరకు సిలిండర్ కొనుక్కోవాల్సిందే!