: సొంత డబ్బుతో.. నాలుగు బోయింగ్ విమానాల్లో ఖతార్ భక్తులను తీసుకొస్తా...ఎవరడ్డుకుంటారో చూస్తా: సౌదీ అరేబియా నటి


సహచర ముస్లిం దేశాల ఆంక్షలు ఎదుర్కొంటూ హజ్ యాత్రకు సౌదీ అరేబియా వెళ్లకుండా భక్తులను ఖతార్ అడ్డుకోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకు చెందిన సినీ నటి రీమ్ అబ్దుల్లా (30) ఖతార్ నుంచి ముస్లిం భక్తులను హజ్ ప్రార్థనలకు తీసుకొచ్చేందుకు నాలుగు బోయింగ్ 777 విమానాలను అద్దెకు తీసుకోనున్నానని, ఈ యాత్రకయ్యే ప్రయాణ ఖర్చులను తానే భరిస్తానని ఆమె ప్రకటించారు. ఈ మేరకు దేవుడికి ప్రమాణం చేశానని ఆమె చెప్పారు.

కాగా ఇందుకోసం ఆమె సుమారు 3 కోట్ల 94 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఒక్కో బోయింగ్ విమానంలో సుమారు 396 మంది ప్రయాణించే అవకాశం ఉంది. హజ్ ప్రార్థనల కోసం వచ్చే భక్తులను ఖతార్ పాలకులు ఎలా అడ్డుకుంటారో చూస్తానని ఆమె సవాల్ విసిరారు. కాగా, హజ్ యాత్రకు సాయం చేయడం ముస్లిం సంప్రదాయంలో అతిపెద్ద పుణ్యంగా భావిస్తారు. సంపాదనలో కొంత శాతం అల్లాకు సమర్పించాలి, అంటే పేదలకు దానం చేయాలని మతబోధకులు బోధిస్తుంటారు. అలాగే ప్రతి ముస్లిం జీవిత కాలంలో ఒకసారైనా మక్కా సందర్శించాలన్న నిబంధన కూడా ముస్లిం సమాజంలో ఉంది. 

  • Loading...

More Telugu News