: ఉద్యోగం సాధించడానికి సుప్రీంకోర్టు సాయం!
పోస్టల్ శాఖ చేసిన తప్పుకు అభ్యర్థి ఉద్యోగం కోల్పోకుండా సుప్రీంకోర్టు సాయం చేసింది. తన తీర్పు ద్వారా అభ్యర్థి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆశుతోష్ అగ్నిహోత్రి న్యాయమూర్తి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, పోస్టల్ శాఖ పనితీరు వల్ల ఆ దరఖాస్తు సంబంధిత ఉద్యోగ విభాగానికి ఒకరోజు ఆలస్యంగా చేరింది.
దీంతో ఆశుతోష్ దరఖాస్తును పరిగణలోకి తీసుకోలేదు. ఈ విషయంపై అతడు మధ్యప్రదేశ్ హైకోర్టులో కేసు వేశాడు. కోర్టు అతని అప్పీలును తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఇతని సమస్యపై సుప్రీంకోర్టు పూర్తి విచారణ తర్వాత ఆశుతోష్‌ను అభ్యర్థిగా పరిగణించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆశుతోష్ ఫలితాన్ని గోప్యంగా ఉంచాలని తెలియజేసింది. ఇటీవల ఆశుతోష్ ఫలితాన్ని సుప్రీంకోర్టు వెల్లడించింది. అతను అర్హత సాధించడంతో దీన్ని పోస్టల్ శాఖ తప్పుగా పరిగణించి వెంటనే ఇంటర్వ్యూకు పిలవాలని మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది.