: రాజకీయనాయకులు ఇగోలు పక్కనపెట్టి సమస్యలు పరిష్కరించాలి: పవన్ కల్యాణ్
దశాబ్దాలుగా పేరుకుపోయిన ఉద్ధానం సమస్యపై ప్రజలతో కలిసి పోరాడానని, ప్రజల అనారోగ్య సమస్యను అంతర్జాతీయ సమాజానికి తెలిపానని పవన్ కల్యాణ్ అన్నారు. సమస్య వచ్చినప్పుడు దాని క్రెడిట్ తీసుకోవడంపై పోరాటం జరుగుతుందని అన్నారు. ఉద్ధానం సమస్యపై రాజకీయ విమర్శలు చేస్తే సమస్య పక్కదారి పడుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. మనుషులు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు రాజకీయ లబ్ధి పొందడం దిగజారుడుతనమని ఆయన చెప్పారు. సమాజాన్ని ఒక తాటి మీదకి తెచ్చేందుకు, ప్రజలంతా ఏకమై సమస్యలు ఎదుర్కొనేందుకు రాజకీయ వేదికలు కావాలని ఆయన అన్నారు. ఇంతకు ముందే అక్కడ అధ్యయనాలు జరిగాయని అన్నారు.
అయితే దాని ఫలితాల తరువాత ఏం చేయాలన్న దానిపై ఎలాంటి అంచనా లేదని చెప్పారు. 50 శాతం కిడ్నీలు చెడిపోతే కానీ జరిగిన నష్టం తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోనే వారు సమస్యను చేతులు కాలిన తరువాత తెలుసుకోగలుగుతున్నారని ఆయన తెలిపారు. అక్కడ సర్ ప్లస్ కిడ్నీ సెంటర్ కావాలని అన్నారు. అక్కడ అనాథలైపోయిన పిల్లలు ఉన్నారని, వారిని ప్రభుత్వమే దత్తత తీసుకోవాలని పవన్ కోరారు. ఈ రెండు డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆయన అన్నారు. ఉద్ధానం సమస్యపై పోరాడేందుకు చాలా మంది ముందుకు వచ్చినా రాజకీయ నాయకులు వారిని అడ్డుకున్నారని ఆయన తెలిపారు. అలాంటి వారంతా ఇగోను పక్కనపెట్టాలని ఆయన చెప్పారు.