: పెళ్లి తరువాత ప్రేమలో పడిన ప్రిన్సెస్ డయానా... బంధనాలు తెంచుకుని వెళ్లిపోవాలనుకుంది కూడా!


బ్రిటన్‌ యువరాణి డయానా జీవితంలో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనలు మరోసారి ఆసక్తి రేపుతున్నాయి. 31 ఆగస్టు 1997లో కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రిన్సెస్ డయానా జీవితంలోని పలు కోణాలు రాచరికం మాటున దాగిన నిబంధనలను బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేశాయి. బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ ఛార్లెస్‌ తో వివాహానంతరం ఇతర మహిళలతో కొనసాగించిన సంబంధాలపై డయానా పలుమార్లు ప్రశ్నించింది. సౌందర్యవతిగా, నిరాడంబరమైన వ్యక్తిగా నీరాజనాలు అందుకున్న డయానా.. ఛార్లెస్ లోని ప్రేమరాహిత్యాన్ని జీర్ణించుకోలేకపోయింది.

దీంతో ఆమె అంగరక్షకుడు బారీ మన్నాకీతో ప్రేమలో పడినట్టు ఛానెల్ 4 కథనం ప్రచురించింది. అందులో డయానాకు సంబంధించిన ప్రేమ వ్యవహారం కొన్ని టేపుల్లో బహిర్గతమైందని తెలిపింది. ఆమెకు ఉచ్చారణలో పాఠాలు నేర్పిన పీటర్‌ సెట్టెలన్‌ రికార్డు చేసిన వీడియోల్లో ఇది వెల్లడయిందని తెలిపింది. కెన్సింగ్‌ టన్‌ ప్యాలెస్ లో 1992-93 మధ్యకాలంలో వీటిని రికార్డు చేసినట్టు పేర్కొంది. స్వరాన్ని పరీక్షించే సమయంలో ఆమె మాటలను రికార్డు చేశారని పేర్కొంది. 1991లో ప్రిన్స్ ఛార్లెస్‌ తో విడిపోయిన అనంతరం తన భావాలను ప్రజలకు చెప్పేందుకు వీలుగా సహాయ పడడం కోసం ఆమె సెట్టెలన్‌ ను నియమించుకున్నారు.

ఆ సమయంలో ఆమె మనసులో భావాలను వివరించారు. ఆమె వ్యక్తిగత సంభాషణల్లో ‘24 లేదా 25 ఏళ్ల వయసులో నేనొకతనిని చాలా గాఢంగా ప్రేమించాను. అతడు కూడా ఇదే వాతావరణంలో పనిచేసేవాడు. అతడితో నిరాడంబరంగా జీవించేందుకు సంతోషంగా అంగీకరించా'నని పేర్కొన్నారు. ఈ విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. తల్లిని ఎంతో ఉన్నతంగా ఊహించుకున్న ప్రిన్స్ విలియమ్, హ్యారీలను ఈ టేపులు ఇబ్బందిపెట్టే అవకాశం ఉందని, వాటిని ప్రసారం చేయవద్దని డయానా సోదరుడు ఎర్ల్ స్పెన్సర్ ఆ ఛానెల్ ను కోరారు.

  • Loading...

More Telugu News