: ఏపీ జీవన్ దాన్ బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కల్యాణ్!
ఏపీ జీవన్ దాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఆంధప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణ నిమిత్తం అమరావతి జీవన్ దాన్ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకంలో భాగంగా పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు ఉచితంగా అందించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పథకానికి మరింత ప్రచారం కల్పించేందుకు పేరున్న వ్యక్తిని ప్రచారకర్తగా నియమించుకోవాలని ప్రభుత్వం భావించింది.
ఉద్దానం కిడ్నీ సమస్యలపై పోరాటంతో తన చిత్తశుద్ధి నిరూపించుకున్న పవన్ కల్యాణ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తే దానికి మరింత ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. దీంతో ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని ప్రభుత్వం కోరగానే, పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. దీంతో అమరావతి జీవన్ దాన్ బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కల్యాణ్ వ్యవహరించనున్నారని సమాచారం.