: నాన్న చనిపోయిన బాధలో ఉన్నా.. డ్రగ్స్ కేసులో నా పేరు రావడం షాక్ కు గురి చేసింది: తనీష్
గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో తాను ఉన్నానని... ఇన్నేళ్ల కాలంలో తాను ఏ వివాదంలోనూ ఇరుక్కోలేదని సినీ నటుడు తనీష్ అన్నాడు. తండ్రి చనిపోయిన బాధలో తాను ఉన్నానని... ఆ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నానని... తండ్రి మరణంతో కొడుకుగా ఇంటి బాధ్యతలన్నీ తపపైనే పడ్డాయని చెప్పాడు. ఈ నేపథ్యంలో, బయట సంబంధాలను చాలామటుకు తగ్గించుకున్నానని... విందులు, వినోదాలకు కూడా దూరమయ్యానని అన్నాడు.
ఇలాంటి సమయంలో తన పేరు డ్రగ్స్ కేసులో రావడం, తనను షాక్ కు గురి చేసిందని చెప్పాడు. డ్రగ్స్ కేసులో తన పేరు వచ్చినప్పటి నుంచి తన కుటుంబసభ్యులు ఎంతో ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. డ్రగ్స్ కేసుతో సంబంధం లేకుండానే నోటీసులు అందుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. నోటీసులు వచ్చిన నేపథ్యంలోనే, తాను విచారణకు హాజరయ్యానని తెలిపాడు.