: సింధు నదీజలాల ఒప్పందంపై తటస్థ ధోరణి చూపించనున్న ప్రపంచ బ్యాంక్
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య గత 57 ఏళ్లుగా ఎటూ తేలకుండా ఉన్న సింధు నదీజలాల ఒప్పందం వివాదంలో తాను తటస్థ ధోరణి చూపిస్తానని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. తమ ఆధ్వర్యంలో ఇరు దేశాల మధ్య ముఖాముఖి చర్చలకు ఆహ్వానిస్తూ అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సర్నాకు రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొంది. వాషింగ్టన్లో జరగనున్న ఈ ముఖాముఖికి భారత్ తరఫున కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జీత్ సింగ్‌తో సహా జలవనరుల శాఖ, విదేశాంగ శాఖలకు చెందిన ఇతర అధికారులు వెళ్లనున్నారు.
జమ్మూకాశ్మీర్‌లో ఉన్న రెండు జలవిద్యుత్ ప్రాజెక్టుల డిజైన్‌పై పాకిస్థాన్ అభ్యంతరం తెలపడంతో సింధు నదీజలాల వివాదం మొదలైంది. ఈ వివాదంపై పాకిస్థాన్ గతేడాది అంతర్జాతీయ కోర్టులో ఫిర్యాదు చేసింది. తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో పర్మినెంట్ ఇండస్ కమిషన్ పేరుతో పాకిస్థాన్‌లో ఈ విషయంపై చర్చలు జరిగాయి. ఈ చర్చల వల్ల విషయం తేలకపోవడంతో ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో మళ్లీ చర్చలు జరగనున్నాయి.