: సౌదీ అరేబియానా... మేం వెళ్లం బాబోయ్!: భారత విమానయాన సిబ్బంది
సౌదీ అరేబియా పేరు చెప్పగానే భారత విమాన సంస్థల్లో పనిచేసే సిబ్బంది వణికిపోతున్నారు. ఆ దేశానికి వెళ్లే విమానాల్లో పని చేయడానికి ససేమిరా అంటున్నారు. దీనంతటికీ కారణం అక్కడి నియమాలే! అక్కడికి వెళ్లగానే ఇతర దేశ విమాన సిబ్బంది పాస్‌పోర్టులను ఆ దేశ అధికారులు తీసుకుంటారు. వాళ్లు అక్కడి నుంచి వెళ్లే వరకు విమాన సిబ్బంది దగ్గర పాస్‌పోర్టు జిరాక్స్ కాపీ మాత్రమే ఉంటుంది. ఈ నియమం ఎప్పట్నుంచో ఉంది కానీ, ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల సౌదీ అరేబియా వెళ్లడానికి సిబ్బంది భయపడుతున్నారు.
జూలై 27, 2017న ఎయిరిండియా 931 విమానం సౌదీలోని జెడ్డా విమానాశ్రయంలో దిగింది. విశ్రాంతి తర్వాత ముగ్గురు సిబ్బంది భోజనం చేయడానికి బయటకు వెళ్లారు. అక్కడ వీరి కారును సౌదీ పోలీసులు ఆపి, పాస్‌పోర్టు అడిగారు. జిరాక్స్ కాపీ చూపించడంతో వారి ఫోన్లు లాక్కున్నారు. తర్వాత పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి మూడు గంటల పాటు విచారించి వదిలేశారు. ఇదంతా ఒరిజినల్ పాస్‌పోర్టులు విమానాశ్రయం వారు తీసుకోవడం వల్లే జరిగిందని ఎయిరిండియా సౌదీ కార్యాలయంలో సిబ్బంది ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఈ సమస్య గురించి విమానయాన సంస్థలు భారత విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేశాయి. అప్పుడు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఈ విషయాన్ని కోర్టు వరకే తీసుకెళ్లే యోచనలో విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.