: జియోకు పోటీగా.. మార్కెట్లోకి రానున్న ఐడియా 4జీ ఫోన్!
మార్కెట్లోకి జియో రాక పలు టెలికాం కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 4జీ వీవోఎల్టీ నెట్ వర్క్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన జియో... అనతి కాలంలోనే కోట్లాదిమంది వినియోగదారులను సొంతం చేసుకుని, టెలికాం దిగ్గజాలకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా, ఫీచర్ ఫోన్ ను కూడా తీసుకొస్తూ, కొత్త సవాల్ విసిరింది. రూ. 1500ల రిఫండబుల్ డిపాజిట్ తో ఈ ఫోన్లను తన వినియోగదారులకు జియో అందిస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ల బుకింగ్స్ జరుగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో వినియోగదారుల చేతుల్లోకి రానున్నాయి.
ఈ నేపథ్యంలో జియోకు పోటీగా... 4జీ ఫోన్ ను ఐడియా సెల్యులార్ ప్రకటించింది. అయితే, దీని ధర రూ. 2,500 వరకు ఉంటుందని ఐడియా సెల్యులార్ ఎండీ హిమాన్షు కపానియా తెలిపారు. ఈ మొబైల్స్ కోసం ఓ తయారీ కంపెనీతో కలసి పనిచేస్తున్నామని చెప్పారు. జియో ఫోన్లలో లేని ఫీచర్లు కూడా తమ ఫోన్ లో ఉంటాయని హిమాన్షు తెలిపారు. వాట్సాప్, గూగుల్, ఫేస్ బుక్ లాంటి పాప్యులర్ యాప్స్ అన్నీ ఐడియా ఫోన్ లో ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా, తమకు ఇష్టమైన నెట్ వర్క్ ను వినియోగదారుడు వాడుకునే సౌలభ్యం కూడా ఉంటుందని తెలిపారు. ఈ కారణంగానే, జియో కంటే తమ ఫోన్ ధర కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పారు.