: పవన్ కల్యాణ్ కు భరోసా ఇచ్చిన చంద్రబాబు!
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలను తగ్గించేందుకు తక్షణం మరిన్ని చర్యలు తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ ఉదయం పవన్ తో పాటు హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి వచ్చిన వైద్య బృందంతో వెలగపూడి సచివాలయంలో భేటీ అయిన చంద్రబాబు, ఇప్పటికే తాము తీసుకున్న చర్యలను వివరించారు. ఆపై వర్శిటీ ప్రొఫెసర్లు ఇచ్చిన ప్రజెంటేషన్ ను విని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలన్నదే తమ అభిమతమని తెలిపారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరింత ఉపశమనాన్ని కల్పించాలన్న కృత నిశ్చయంతో ఉన్నామని అన్నారు. ఇప్పటికే ఉచిత డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇక మరెవరికీ వ్యాధులు సోకకుండా చేసేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని అన్నారు. చిన్న వయసు నుంచే రక్షిత మంచినీటిని మాత్రమే తాగేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులు సమస్యకు కారణాలను కొనుగొనలేకపోయారని, దీనిపై ముందుకు కదిలిన పవన్ కల్యాణ్ అభినందనీయుడని చంద్రబాబు అన్నారు. హార్వర్డ్ వైద్య బృందం ఇచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.