: సినిమావాళ్లు ఏం చెప్పారో బయట పెట్టాల్సిందే: సిట్ కు రాంగోపాల్ వర్మ డిమాండ్


సిట్ అధికారుల విచారణలో భాగంగా సినిమావాళ్లు ఏం చెప్పారో బయటకు వెల్లడించాలని దర్శకుడు రాంగోపాల్ వర్మ డిమాండ్ చేశారు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన వర్మ, తాము డ్రగ్స్ వాడామా? లేదా? అన్న విషయాన్ని సినీ ప్రముఖులు వెల్లడిస్తేనే బయటకు తెలుస్తుందని... లేకుంటే వారు వాడినట్టు ఒప్పుకున్నారని సిట్ చెబితే విషయం బయటకు వస్తుందని, అటు వాళ్లూ, ఇటూ వీళ్లూ చెప్పకుండా ఉంటే, మీడియా ఎందుకు వాళ్లను దోషులుగా చేస్తోందని ప్రశ్నించాడు.

ఇండియాలో 50 సంవత్సరాలకు పూర్వం నుంచే డ్రగ్స్ దందాలు నడుస్తున్నాయని, అప్పటి నుంచి బయటకు రాని ఈ వ్యవహారం, కేవలం 15 రోజుల నుంచి పతాక శీర్షికలకు ఎక్కడం వెనుక సినీ ప్రముఖులు ఉండటమే కారణమని అన్నాడు. తాము నోటీసులు ఇచ్చిన వారు డ్రగ్స్ వాడినట్టు సాక్ష్యాలు ఉన్నాయని సిట్ అధికారులు చెప్పాల్సి వుందని తెలిపాడు. ఒకవేళ సిట్ అధికారులు కాలక్షేపం కోసం సినిమావాళ్లను పిలిచారా? అన్న విషయం తనకు తెలియదని, ఈ ప్రశ్నకు వాళ్లే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

"మేం ఫలానా ప్రశ్నలు అడిగాం. వారు ఈ సమాధానాలు చెప్పారు అని సిట్ అధికారులు ప్రకటిస్తే బాగుంటుంది" అని రాంగోపాల్ వర్మ తెలిపాడు. సినిమా వాళ్లు తప్పు చేస్తున్నారన్న భావన కలిగించడం తప్పన్నదే తన అభిప్రాయమని అన్నాడు. డ్రగ్స్ వాడవద్దని తాను చెప్పినంత మాత్రాన వాడేవారు మానేయరని, తాను అలవాటు చేసుకోవాలని చెబితే, అలవాటు లేనివారు చేసుకోరని చెప్పాడు.

  • Loading...

More Telugu News