: కమలహాసన్ పై రూ. 100 కోట్ల పరువునష్టం దావా!
విలక్షణ నటుడు కమలహాసన్ పై తమిళనాడుకు చెందిన పుత్తియ తమిజఘం పార్టీ రూ. 100 కోట్ల పరువునష్టం దావా వేసింది. ఈ నేపథ్యంలో, కమల్ తో పాటు తమిళ బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంటున్న కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామన్, షోను నిర్వహిస్తున్న టీవీ ఛానల్ లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ షోలో మురికివాడలు, గుడిసెల్లో నివసిస్తున్న వారిని కించపరిచారనే ఆరోపణలతో పుత్తియ తమిజఘం చీఫ్ కృష్ణమూర్తి ఈ దావాను వేశారు. ఏడు రోజుల్లోగా కమల్, గాయత్రి, టీవీ ఛానల్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ షోలో పోటీదారుడిగా ఉన్న ఓ నటుడిపై గాయత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతని ప్రవర్తన మురికివాడల్లో నిసించేవారిలా ఉందని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కృష్ణమూర్తి పరువునష్టం దావా వేశారు. వీరి వ్యాఖ్యలు తక్కువ కులాలు, పేదవారిని కించపరిచేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ షోలో కుల సంబంధమైన ప్రవర్తనను కమల్ ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఈ దావాపై కమల్ ఇంకా స్పందించాల్సి ఉంది.