: ట్రంప్ తో సెల్ఫీలు దిగాను... మా ఆయన వదిలేశాడంటున్న చీర్ లీడర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో దిగిన సెల్ఫీలు తన కాపురాన్ని కూల్చాయని బాధపడుతోంది ఓ చీర్ లీడర్. ఆయనపై అభిమానంతో సెల్ఫీలు దిగితే, తన భర్తతో గొడవలు వచ్చాయని వాపోయింది. ఇంకాస్త లోతైన సమాచారానికి వెళితే, గతంలో అమెరికన్ ఫుట్ బాల్ జట్టు మయామి డాల్ఫిన్స్ కు చీర్ లీడర్ గా పని చేసిన లిన్ అనే యువతి, ఫ్లోరిడాకు చెందిన డేవ్ లు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అధ్యక్షుడు కాకముందు నుంచే లిన్ కు డొనాల్డ్ ట్రంప్ అంటే ఎంతో ఇష్టం. తన పెంపుడు కుక్కకు ట్రంప్ కూతురు ఇవాంకా పేరు పెట్టుకుని ముద్దుగా సాకేది. ఇక ట్రంప్ అధ్యక్షుడైన తరువాత కూడా పలుమార్లు ఆయన్ను కలిసి సెల్ఫీలు దిగింది. ట్రంప్ ను తన భార్య పదేపదే కలవడం డేవ్ కు ఇష్టంలేకపోగా, తరచూ వారి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఇద్దరూ కోర్టుకు ఎక్కగా, విడాకులు మంజూరయ్యాయి. తాము విడిపోవడానికి కారణం ట్రంపేనని అంటోంది లిన్.