: నిండిపోయిన ఆల్మట్టి, నారాయణపూర్... వెలవెలబోతున్న శ్రీశైలం, సాగర్
కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆల్మట్టి డ్యామ్ తో పాటు నారాయణపూర్ నిండుకుండలా మారిపోయింది. 129 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న ఆల్మట్టి జలాశయంలో ప్రస్తుతం 123 టీఎంసీలకు పైగా నీరు చేరింది. ఎగువ నుంచి 37,332 క్యూసెక్కల నీరు వస్తోంది. ఇక నారాయణపూర్ విషయానికి వస్తే 37 టీఎంసీల నిల్వ సామర్థ్యముండగా, 36.5 టీఎంసీల నీరు చేరుకుంది. నారాయణపూర్ జలాశయంలోకి సుమారు 20 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది.
ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడంతో చాలా స్వల్పంగానే నీటిని కిందకు వదులుతున్న పరిస్థితి. జూరాలకు ఎటువంటి వరదా రావడంలేదు. తుంగభద్ర జలాశయానికి 13 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుండగా, శ్రీశైలం డ్యామ్ కు 49 క్యూసెక్కులు, నాగార్జున సాగర్ కు 400 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 215 టీఎంసీల సామర్థ్యమున్న శ్రీశైలంలో 20 టీఎంసీలు, 312 టీఎంసీల సామర్థ్యమున్న సాగర్ లో 116 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతం ఉంది. ఈ రెండూ నిండాలంటే కర్ణాటకలో మరో విడత భారీ వర్షాలు కురవాల్సి వుందని అధికారులు అంటున్నారు.