: డ్రగ్స్ కేసులో తీవ్ర చర్చనీయాంశమైన అకున్ ప్రకటన.. ఆ పెద్దలు ఎవరంటూ ఎడతెగని చర్చ!
డ్రగ్స్ కేసును విచారిస్తున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ చేసిన ప్రకటన ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో కొందరు సినిమా పెద్దలు, బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల పిల్లలు ఉన్నారని, అయితే వారి పేర్లు వెల్లడించవద్దంటూ తమపై ఒత్తిళ్లు ఉన్నాయని పేర్కొని సంచలనం సృష్టించారు. ఆయన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. పోలీసులపై ఒత్తిడి తెచ్చేంత సీన్ సామాన్యులకు, సినీ పరిశ్రమకు చెందిన వారికి ఉండే అవకాశం లేదని, కాబట్టి అకున్ చెప్పిన దానిని బట్టి వ్యవస్థలో బాగా పలుకుబడి కలిగిన వారే అందులో ఉన్నట్టు చెబుతున్నారు.
డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఇద్దరు పెద్ద నిర్మాతల కుమారులు, ఓ పెద్ద నటుడి కుమార్తె, ఓ పత్రికాధిపతి ఉన్నట్టు చెబుతున్నా తొలి జాబితాలో వారి పేర్లను ఎక్కించలేదు. దీంతో రెండో జాబితాలోకైనా వారి పేర్లు వస్తాయా? లేక నీరు గారిపోయినట్టేనా? అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ కేసులో అధికారపార్టీకి చెందిన ప్రముఖ నేత కుమారుడి పేరు కూడా వెలుగులోకి రావడం పెను సంచలనంగా మారింది. రాయలసీమకు చెందిన మైనింగ్ కాంట్రాక్టర్ ద్వారా ఆయన ఎల్ఏఎస్‌డీ తెప్పించుకునేవారని సమాచారం.
ఈ కేసులో ఎవరినీ వదల వద్దని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే అధికారులకు పూర్తి అధికారం ఇచ్చినా ఆ నేత వ్యవహారంలో మాత్రం గప్‌చుప్‌గా వ్యవహరించాలని అధికారులు నిర్ణయం తీసుకోవడం వెనక పెద్ద తలకాయల ఒత్తిళ్లే ఉన్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఉన్న ‘పెద్దల’ పిల్లలను ముట్టుకునే సాహసం చేసే ప్రసక్తే లేదని, అది అనుకున్నంత సులభం కాదని స్వయంగా అధికారులే చెబుతుండడం గమనార్హం. రాజకీయ అండదండలు ఉన్న వారికి గుట్టుచప్పుడు కాకుండా వారి ఇంటికే వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేయాలన్న ఒత్తిళ్లు కూడా ఉన్నట్టు సమాచారం.