: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తెలుగుతేజం.. రాంమాధవ్‌కు చాన్స్?
తెలుగువాడైన వారణాసి రాంమాధవ్ బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుత చీఫ్ అమిత్ షా త్వరలో కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన స్థానాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో భర్తీ చేయించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాంమాధవ్‌తోపాటు రాజస్థాన్‌కు చెందిన ఓపీ మాథుర్, కేంద్రమంత్రి జేపీ నడ్డాలు కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాక రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకంతోపాటు మంత్రివర్గ విస్తరణపైనా మోదీ దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. ఇక గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కానున్న అమిత్ షాను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవడం దాదాపు ఖాయమైంది. ఆయన మంత్రి అయితే ప్రస్తుత బీజేపీ చీఫ్ పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ పదవి కోసం ఇప్పటికే రాంమాధవ్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. మరోవైపు గతంలో రాజ్‌నాథ్ సింగ్ తర్వాత ఓపీ మాథుర్, జేపీ నడ్డాల పేర్లు పార్టీ అధ్యక్ష పదవి రేసులో తెరపైకి వచ్చినా అనూహ్యంగా అమిత్ షాకు ఆ పదవి దక్కింది.