: నంద్యాలలో ఓడితే రాజకీయాలు వదిలేస్తా: భూమా అఖిల ప్రియ
నంద్యాల ఉపఎన్నికల్లో ఓటమిపాలైతే రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానని మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు. పలు విషయాలపై ఆమె స్పందిస్తూ, తన తండ్రి మరణించారన్న వార్త ప్రకటించకముందే పక్కగదిలో వారసుడెవరంటూ శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడారని అన్నారు. ఆయన పదవి కోసమే పార్టీ మారారని, ప్రజలు అంతా గమనిస్తున్నారని, వారికి అంతా తెలుసని ఆమె చెప్పారు. ఎన్నికల్లో పాల్గొనడం తొలిసారి కనుకే తనకు సహచర మంత్రులు సహాయం చేస్తున్నారని ఆమె అన్నారు.
తనకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉందని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. తనపై వచ్చే ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టే తన మామ సుబ్బారెడ్డితో అభిప్రాయభేదాలు ఉన్నాయని తెలిపారు. అయితే, అవి తమ బంధాన్ని విఛ్చిన్నం చేసేంత, మీడియా చూపేంత స్థాయిలో లేవని ఆమె చెప్పారు. నంద్యాల ఉపఎన్నికల్లో విజయం తమదేనని ఆమె స్పష్టం చేశారు.