: ఫిదా సినిమాకు నాకు దక్కిన అతి పెద్ద కాంప్లిమెంట్ ఇదే!: సాయి పల్లవి
ఫిదా సినిమా చేసిన తరువాత తనకు దక్కిన అతిపెద్ద కాంప్లిమెంట్ తన చెల్లి చెప్పిన ప్రశంసాపూర్వక మాటలని కథానాయిక సాయి పల్లవి తెలిపింది. ఈ సినిమాను తన చెల్లెలితో కలిసి తొలి రోజు చూశానని చెప్పింది. తెలుగు సినిమాల్లో హీరోయిన్లు చాలా అందంగా ఉంటారని, చాలా అందంగా ఉన్న హీరోయిన్లనే బాగా ఆదరిస్తారని తాను విన్నానని చెప్పింది. అలాంటిది ఈ సినిమాలో ఏమాత్రం మేకప్ లేకుండా మొటిమల ముఖాన్ని చూస్తారా? ఆదరిస్తారా? అని చాలా భయపడ్డానని చెప్పింది. మలయాళంలో అలాంటి భయం ఉండేది కాదని చెప్పింది. అక్కడ పాత్రను మాత్రమే పట్టించుకుంటారని, అందం గురించి పెద్దగా పట్టించుకోరని తెలిపింది.
అందుకే మలయాళంలో ఎంట్రీ సమయంలో పెద్దగా భయపడలేదు కానీ, తెలుగులో ఎంట్రీ సమయంలో చాలా భయపడ్డానని చెప్పింది. ధియేటర్లో తన చెల్లెలితో కలిసి కూర్చుని ఆమె చేతిని బలంగా పట్టుకుని కూర్చున్నానని... అయితే తన పాత్ర పరుగెడుతూ చెప్పులు కనిపించగానే పేపర్లు గాల్లో ఎగిరాయని, వాటిని చూసి సంతోషపడ్డానని చెప్పింది. సినిమా పూర్తైన అనంతరం తన చెల్లెలు నువ్వేనా నటించింది? అంటూ అభినందించిందని చెప్పింది. నువ్విలా నటిస్తావని ఊహించలేదని...చాలా బాగా నటించావని సంతోషంతో చెప్పిందని సాయిపల్లవి గుర్తు చేసుకుంది. తన చెల్లెలు పూజకి తాను ఏం చేసినా నచ్చదని, తన నటనలో వంకలు పెడుతుందని, అలాంటి పూజ అలా అనేసరికి చాలా సంతోషమేసిందని చెప్పింది.