: పవన్ వ్యూహం మార్చుతున్నారా?... వైజాగ్ సదస్సులో మాటల వెనుక అంతరార్థం ఏంటి?
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం మార్చుతున్నారా? అంటే వైజాగ్ లో ఆయన ఆడిన మాటలు అవుననే సమాధానమిస్తున్నాయి. సమస్యలపై స్పందించే పవన్ కల్యాణ్ ఉద్ధానం బాధితుల సమస్యలు పరిష్కరించేందుకు హార్వార్డ్ యూనివర్సిటీ నిపుణులతో పాటు, వైజాగ్ లోని ఆంధ్రమెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు, పరిశోధకులు, వైద్య విద్యార్ధులతో పాటు కలిసి పని చేసేందుకు సిద్ధమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైతే ప్రతిపక్షనేత జగన్ ను కలిసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని అన్నారు. అలాగే చివర్లో 'జనావాసాల్లో మద్యం దుకాణాలు వద్దు' అనే ప్లకార్డు ప్రదర్శించారు.
గతంలో పవన్ కల్యాణ్ ఏపీ హక్కులు, కేంద్రం స్పందనపై తీవ్రంగా స్పందించేేవారు. కేంద్రం తీరును ప్రశ్నించేవారు. రాష్ట్రంలోని అధికార, విపక్షాలను మాత్రం ఆయన పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. ఇప్పటికీ అదే వ్యూహం అమలు చేస్తున్నప్పటికీ, సమస్యల పరిష్కారానికి జగన్ ను కలిసేందుకు అభ్యంతరం లేదని చెప్పడం ఆసక్తి రేపుతోంది. చంద్రబాబుకు పవన్ వత్తాసు పలుకుతున్నాడన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేతలను కలుస్తానని చెప్పడం ఆసక్తి రేపుతోంది. అలాగే జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దంటూ అధికార పక్షాన్ని హెచ్చరించడం కూడా టీడీపీ విధానాల పట్ల పవన్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా? అన్న అనుమానాలు రేపుతున్నాయి. మహిళలు దీనిపై తనను మాట్లాడమన్నారని, ప్రస్తుతం తాను దీనిపై మాట్లాడలేనని చెప్పడం కూడా ఆసక్తి రేపుతోంది.