: 'జై లవ కుశ' పాట లీక్... ఆన్ లైన్ లో వైరల్!
ప్రముఖ కధానాయకుడు ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవ కుశ’ సినిమాలోని పరిచయగీతం లీకైంది. ఇది ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నట్టు సమాచారం. ఆమధ్య ఈ సినిమా టీజర్ లోని కొన్ని సన్నివేశాలు ఆన్ లైన్ లో లీక్ కాగా, దానికి బాధ్యుడైన గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా 'రావణ..' అంటూ సాగే పరిచయగీతం లీక్ కావడం కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ పోషిస్తున్న మూడు పాత్రల్లోని జై పాత్ర కోసం ఈ పాటను కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది.
కాగా, ఈ మధ్యే విడుదల చేసిన జై పాత్ర టీజర్ కు అశేషమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. దీనికి 24 గంటల్లోనే 7.5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. మూడు పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎలా నటించనున్నాడన్న ఆసక్తి తెలుగు సినీ ప్రేక్షకుల అంచనాలను పెంచుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ‘జై లవ కుశ’లో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా రాశీ ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. దీనికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తుండగా, ఈ సినిమా సెప్టెంబరు 21న విడుదల కానుంది.