: ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోండి: నాణ్యతపై ప్రశ్నిస్తే, అసహనంతో సలహా ఇచ్చిన రైల్వే బోర్డు చైర్మన్


నిత్యమూ రైళ్లలో ప్రయాణించే సుమారు 15 లక్షల మందికి ఆహారాన్ని అందించడం తమకు చాలా క్లిష్టతరమవుతోందని, ప్రయాణికులు ఇంట్లోనే ఆహారం తయారు చేసుకుని తెచ్చుకోవాలని రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ సలహా ఇచ్చారు. రైళ్లలో ఆహార నాణ్యత పూర్తిగా కొరవడిందని వస్తున్న లక్షలాది ఫిర్యాదులపై మిట్టల్ ను ప్రశ్నించిన వేళ, సహనాన్ని కోల్పోయిన ఆయన, ఇంట్లోనే వండి తెచ్చుకోవాలని అన్నారు. ఇటీవల పూర్వా ఎక్స్ ప్రెస్ లో ఓ ప్రయాణికుడి ఆహారంలో బల్లి వచ్చిన ఘటన దేశవ్యాప్తంగా రైల్వేల కాటరింగ్ పై మరో మారు సందేహాలను లేవనెత్తగా, సమస్యలు తమకు తెలుసునని, ప్రయాణికులకు క్వాలిటీతో కూడిన ఆహారాన్ని ఇవ్వడం తమకు సవాలుగా నిలిచిందని, రోజుకు 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, అంతమందికి ఆహారం ఇవ్వాలంటే ఇబ్బందులు తప్పవని అన్నారు.

సమస్యను పరిష్కరించేందుకు బేస్ కిచెన్ లను ప్రారంభించాలని భావిస్తున్నామని, మరో ఏడాదిలోగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో బేస్ కిచెన్ లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. రైళ్ల ఆలస్యంపై స్పందిస్తూ, రవాణా రైళ్ల నిమిత్తం ప్రత్యేక లైన్లను నిర్మించే పనులు సాగుతున్నాయని, ఇవి అందుబాటులోకి వస్తే, ఆలస్యం పూర్తిగా తగ్గుతుందని అన్నారు. కొన్ని రైళ్లలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తుండటం కూడా ఆలస్యానికి కారణంగా నిలుస్తోందని, ఈ తరహా సమస్యలను తొలుత పరిష్కరిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News