: పాక్ ప్రధాని షరీఫ్‌కో నీతి.. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికో నీతా?: నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. పనామా పేపర్స్ కుంభకోణంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు పడిందని, కానీ అదే పనామా పేపర్స్‌లో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయని, అయినా ఆయనపై ఎటువంటి చర్యలు లేవని మండిపడ్డారు. దేశంలో అవినీతిని తుదముట్టించే వరకు నిద్రపోనని ప్రధాని మోదీ ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ చత్తీస్‌గఢ్‌లోని అవినీతి మాత్రం ఆయన కంటికి కనిపించడం లేదని విమర్శించారు.
నోట్ల రద్దుపైనా రాహుల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయని, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జమ్ముకశ్మీర్ సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో అల్లర్లు పెరిగాయని, శాంతి, సుస్థిరత కరువయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వం తనకు అనుకూలంగా నిబంధనలను మార్చుకుంటూ పోతోందని రాహుల్ దుయ్యబట్టారు.