: జయలలిత నన్ను తొక్కేయాలని చూశారు: కమలహాసన్ ఆరోపణలు
జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనను టార్గెట్ చేసుకుని తొక్కేయాలని చూశారని నటుడు కమలహాసన్ సంచలన ఆరోపణలు చేశారు. తమిళ టెలివిజన్ చానల్ 'తంది'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, విశ్వరూపం చిత్రం విడుదలకు ఏర్పడిన అడ్డంకులను ప్రస్తావిస్తూ, తన సినీ జీవితాన్ని జయలలిత గురిపెట్టారని చెప్పారు. తాను ఏ సామాజిక వర్గాన్నీ కించపరచకున్నా, నాటి పాలకుల రాజకీయాలు తననెంతో విసిగించాయని అన్నారు. తాను రాష్ట్రాన్ని విడిచి వెళతానని కూడా చెప్పానని గుర్తు చేసుకున్నారు.
విమర్శించడం తన హక్కని, ఎవరు తప్పు పట్టినా పట్టించుకునేది లేదని స్పష్టం చేసిన ఆయన, రజనీకాంత్ పార్టీ పెట్టినా తాను విమర్శిస్తానని అన్నారు. తాను ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయలేదని వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, కామరాజ నాడార్, శివాజీ గణేశన్, ఎంజీ రామచంద్రన్ కూడా ఎలాంటి ఉన్నత విద్యనూ అభ్యసించలేదని, వారంతా ప్రజల మన్ననలు పొందిన నేతలేనని చెప్పారు. మనసుకు తోచిన అభిప్రాయాలను వెల్లడించే విషయంలో తానెన్నడూ జంకేది లేదని స్పష్టం చేశారు కమల్.