: అప్పులు ఎగ్గొట్టేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న మహిళ
పీకల్లోతు అప్పుల్లో మునిగిన మహిళ ఆ అప్పును ఎగ్గొట్టేందుకు ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ముఖాన్ని మార్చుకునేందుకు ప్రయత్నించిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే....జిన్హువా ప్రావిన్స్ లోని వూహాన్ పట్టణానికి చెందిన జు నజువాన్ (59) అనే మహిళ పలు బ్యాంకులు, సంస్థల నుంచి సుమారు 25 మిలియన్ యువాన్లను అప్పుగా తీసుకుంది. తీసుకున్న అప్పులు చెల్లించకపోవడంతో ఆ సంస్థలు పోలీసులను ఆశ్రయించాయి.
దీంతో వారు ఆమెను అదుపులోకి తీసుకుని, వూహాన్ లోని న్యాయస్థానంలో హాజరుపర్చగా, వాటిని తక్షణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నుజువాన్ మరో పట్టణానికి పారిపోయింది. అయితే ఆమెను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు... చాలా శ్రమించి ఆమెను పట్టుకున్నారు. అయితే వారు నిర్ధారించుకున్న అడ్రస్ లో 59 ఏళ్ల మహిళ ఉండాల్సిన స్థానంలో 30 ఏళ్ల మహిళ ఉండడం చూసి తలపట్టుకున్నారు. ఆ తరువాత తాము అరెస్టు చేయడానికి వచ్చిన మహిళ ఆమేనని, అప్పులు ఎగ్గొట్టేందుకు ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని తెలుసుకుని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.