: పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా షాహిద్ ఖాకన్ ఆబ్బాసీ!
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా షాహిద్ ఖాకన్ అబ్బాసీని నియమించారు. ఈయన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారధ్యంలోని కేబినెట్ లో పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రిగా పని చేశారు. తొలుత ఖ్వాజా మహముద్ ఆసిఫ్ ను ఆపద్ధర్మ ప్రధానిగా నియమిస్తారని, తరువాత పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి షబాజ్ షరీఫ్ ను ప్రధానిగా నియమిస్తారంటూ వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అయితే పార్టీ సమావేశంలో షాహిద్ అబ్బాసీని ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. 45 రోజుల పాటు ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరిస్తారు. ఈలోగా షబాజ్ షరీఫ్ ఎంపీగా ఎన్నికైతే ఆయనను ప్రధానిగా ఎన్నుకోనున్నట్టు తెలుస్తోంది.