: విక్రమ్ గౌడ్ భార్యను మరోసారి ప్రశ్నించిన పోలీసులు.. కొంత సమయం కావాలన్న షిపాలి!
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఉదంతంలో... ఆయన భార్య షిపాలిని పోలీసులు ఈ ఉదయం మరోసారి ప్రశ్నించారు. విక్రమ్ గౌడ్ పై కాల్పులకు కారణమైన తుపాకీ ఎక్కడ పడేశారన్న కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తనకు కొంచెం సమయం కావాలని విక్రమ్ భార్య పోలీసులను కోరినట్టు తెలుస్తోంది. పోలీసు విచారణలో షిపాలి ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఆసుపత్రిలో విక్రమ్ గౌడ్ క్రమంగా కోలుకుంటున్నారు. మరోవైపు ఇది ముమ్మాటికీ ఆత్మహత్యాయత్నమే అని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో షిపాలిని పోలీసులు మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది.