: ఆయేషా టకియా భర్తకు `లవ్ జిహాద్` బెదిరింపులు
హిందూ మత యువతిని పెళ్లి చేసుకుని `లవ్ జిహాద్`కు పాల్పడినందుకు తనని చంపేస్తామని బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చినట్లు సినీ నటి అయేషా టకియా భర్త ఫర్హాన్ అజ్మీ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన వారు తమను తాము రాజస్థాన్ హిందూ సేన పార్టీకి చెందిన వాళ్లమని చెప్పినట్లు ఫర్హాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తన తండ్రి అబు అజ్మీని, ఒవైసీ కుటుంబాన్ని కూడా అంతం చేస్తామని ఫోన్ కాలర్ బెదిరించినట్లు ఫర్హాన్ తెలిపారు.
తరచుగా మతాలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఫర్హాన్ తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత అబు అజ్మీ మీద కోపంతోనే ఫర్హాన్‌కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తన మామ భావజాలానికి ఆయేషా గానీ, ఫర్హాన్ గానీ ఎప్పుడూ మద్దతు పలకలేదు. అయినా కూడా `లవ్ జిహాద్` నెపంతో బెదిరింపు కాల్స్ రావడంతో ఫర్హాన్ ఆందోళనకు గురవుతున్నాడు. 2009లో వివాహం చేసుకున్న వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.