: మా కుటుంబంలో గాంధీలు, నెహ్రూలు లేరు: వెంక‌య్య నాయుడు


త‌న కుటుంబంలో గాంధీలు, నెహ్రూలు లేక‌పోయినా ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి స్థాయికి ఎదిగే అవ‌కాశాన్ని బీజేపీ క‌ల్పించింద‌ని వెంక‌య్య నాయుడు అన్నారు. విజ‌య‌వాడ‌లో త‌న‌కు జ‌రుగుతున్న ఆత్మీయ స‌భ‌లో ఆయ‌న మాట్లా‌డుతూ చిన్న‌నాటి విష‌యాలు, రాజ‌కీయ ప్ర‌స్థానం గురించి సభికులతో పంచుకున్నారు. రైతు కుటుంబంలో జ‌న్మించిన తాను చాలా క‌ష్టాలు ఎదుర్కున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌నలో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు విజ‌య‌వాడ నుంచే వ‌చ్చాయ‌ని, జై ఆంధ్ర ఉద్య‌మంలో పాల్గొన్నాన‌ని, త‌న‌కు విజ‌య‌వాడ‌తో ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌ని వెంక‌య్య గుర్తుచేసుకున్నారు.

వాజ్‌పేయి త‌మ ప్రాంతానికి వ‌చ్చిన‌పుడు రిక్షాలో తిరిగి ప్ర‌చారం చేశాన‌ని, త‌ర్వాత కొన్నాళ్ల‌కు వాజ్‌పేయి ప‌క్క‌నే కూర్చునే అవ‌కాశం క‌లిగిందని, త‌న క‌న్నా పెద్ద‌వాళ్లు అసెంబ్లీలో ఉన్నా తననే పార్టీ నాయ‌కుడిగా ఎంచుకున్నార‌ని వెంక‌య్య వివ‌రించారు. దేశంలో ప్ర‌ధాని త‌ర్వాత అతి ఎక్కువ బాధ్య‌త‌లున్న ప‌ద‌వి అధికార పార్టీ అథ్య‌క్షుడిగా ఉండ‌ట‌మ‌ని, ఆ బాధ్య‌త‌ను తాను నిర్వ‌ర్తించాన‌ని చెప్పుకొచ్చారు.
 
2019లో కూడా న‌రేంద్ర మోదీ మ‌ళ్లీ ప్ర‌ధానిగా ఎన్నిక‌వ్వాల‌ని వెంక‌య్య ఆకాంక్షించారు. ఆయ‌న వ‌స్తే అస‌మాన‌త‌లు త‌గ్గి, దేశం బాగుప‌డుతుంద‌ని తెలిపారు. దేశం ముందుకెళ్లాలంటే స‌రైన‌ నాయ‌క‌త్వం కావాలని, ఆ ల‌క్ష‌ణాలు మోదీలో ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. వెంక‌య్య ఉప‌రాష్ట్ర‌ప‌తికి ఎంపిక‌వుతాడ‌ని మీరు అనుకున్నారా? అని త‌న స‌తీమ‌ణిని మోదీ  అడిగార‌ని, అందుకు ఆమె ఊహించ‌లేద‌ని స‌మాధాన‌మిచ్చిన‌ట్లు వెంక‌య్య చెప్పారు. 2020లో రాజ‌కీయ స‌న్యాసం చేసి, త‌మ ఊరు వెళ్లాల‌నుకున్న విష‌యాన్ని త‌న స‌తీమ‌ణికి ప‌దే ప‌దే చెబుతుండేవాడిన‌ని వెంక‌య్య అన్నారు.

  • Loading...

More Telugu News