: వదిన మరణవార్త తెలిసి జైలులో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న శశికళ!
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ విషాదంలో కూరుకుపోయారు. తన సోదరుడి భార్య, టీవీవీ దినకరన్‌కు అత్తగారైన సంతానలక్ష్మి ఈనెల 26న మృతి చెందారు. విషయం తెలిసిన శశికళ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు నిరాకరించారు. దీంతో మరింత కుంగిపోయిన శశికళ వదిన మరణాన్ని తలచుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమెను ఊరడించడం ఎవరివల్లా కావడం లేదు. అదే జైలులో ఉన్న శశికళ బంధువు ఇళవరసి మాత్రం శశికళతో ఉంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా, జైలులో శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నట్టు ఆరోపణలు రావడంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమెకు బయట నుంచి ఎటువంటి వస్తువులు అందకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా శశికళకు బయట నుంచి పాలు, పూల సరఫరా ఆగిపోయింది. దీంతో పూజ సమయంలో అందుబాటులో ఉన్న నీళ్లతోనే ఆమె జలాభిషేకం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పురుషుల జైలులో ఉన్న సుధారకన్ కాళీమాత సేవలో గడుపుతున్నారు.