: చదివింది బీటెక్ .. చేస్తున్నది చోరీ.. చివరికి కటకటాల్లోకి!
బీటెక్ చదివాడు.. ఉదయం సూటు, బూటు వేసుకుని ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు. రాత్రి కాగానే మళ్లీ అదే ప్రాంతాలకు వెళ్లి ఎంచక్కా చోరీలు చేస్తాడు. శుక్రవారం పోలీసులకు చిక్కిన పొన్నగంటి రమేశ్ (24) తీరిది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఎడ్లూరుపాడు మండలం జరుగుమల్లికి చెందిన రమేశ్ హైదరాబాద్, కేపీహెచ్‌బీలోని భాగ్యనగర్ కాలనీలో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. గత ఎనిమిది నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో మద్యానికి అలవాటుపడ్డాడు. చివరికి డబ్బుల కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
అదే సమయంలో బైక్ దొంగతనాలకు పాల్పడే సత్యనారాయణతో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి రాత్రివేళ్లలో వాహనాలను దొంగతనం చేసి విక్రయించి ఆ డబ్బుతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. చివరికి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వాహనాన్ని దొంగిలించి దాని నంబరు ప్లేటు మార్చి వాడుకుంటుండగా జూబ్లీ హిల్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తమ స్టైల్లో విచారించగా మొత్తం వివరాలు బయటకొచ్చాయి. విచారణ అనంతరం అతడి నుంచి మరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.