: విక్రమ గౌడ్ కి 30 కోట్లకు పైగా అప్పులు.. అందుకే ఆత్మహత్యా యత్నం అంటున్న పోలీసులు!
విక్రమ్ గౌడ్ ది ఆత్మహత్యాయత్నంగా పోలీసులు నిర్ధారణకు వస్తున్నారు. ఆయన అప్పుల ఊబిలో కూరుకుపోయాడని గుర్తించారు. పలువురి నుంచి 30 కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడైన విక్రమ్ గౌడ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడడం ద్వారా, అప్పులిచ్చిన వారు కొంత కాలం తనను డబ్బు కోసం డిమాండ్ చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాడని భావిస్తున్నారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేశాడని, తొలుత కుడి చేతిలో తుపాకీని ఉంచుకుని ఎడమ చేతిపై కాల్చుకున్నాడని, తరువాత ఎడమ చేతిలో తుపాకీ ఉంచుకుని కుడిచేతిపై కాల్చుకున్నాడని, ఆ తరువాత అతికష్టం మీద భుజం మీద తుపాకీతో కాల్చుకున్నాడని వారు అనుమానిస్తున్నారు.
అందుకు వాడిన తుపాకీ ఇంకా లభ్యం కాలేదని చెబుతున్నారు. తుపాకీ కాల్చినప్పుడు వెలువడే గన్ పౌడర్ విక్రమ్ గౌడ్ చేతికి ఉందని వారు చెబుతున్నారు. మరోవైపు ఇంట్లో నేలపై పడిన రక్తపు మరకలను పనిమనుషులు ఎందుకు తుడిచేశారని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును పరిశీలిస్తుంటే ఇది పబ్లిసిటీ డ్రామా అనిపిస్తోందని పేరుచెప్పని అధికారి ఒకరు పేర్కొన్నారు.