: అత్యాచారాలను అడ్డుకునే సెన్సర్... కనిపెట్టింది భారతీయురాలే!
ప్రపంచ దేశాల దృష్టిలో అత్యాచారాలు, లైంగిక వేధింపులకు భారత దేశం ఒక నమూనాగా మారిపోయింది. ఈ అపఖ్యాతిని చెరపడంలో తన వంతు కృషి చేస్తోంది ఓ భారతీయ శాస్త్రవేత్త. అందుకోసం అత్యాచారాల నుంచి కాపాడే ఓ సెన్సర్‌ను తయారు చేసింది బోస్టన్‌లోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్న మనీషా మోహన్. స్టిక్కర్‌లాగ కనిపించే ఈ సెన్సర్ ఆపదలో ఉన్నపుడు ఆత్మీయులకు, పోలీసులకు సమాచారం చేరవేస్తుంది.
ఈ సెన్సర్‌ను ఎలాంటి దుస్తులపైనైనా ధరించవచ్చు. అంతేకాకుండా ఈ సెన్సర్‌లో తమంతట తాము దుస్తులు విప్పడం లేదా బలవంతంగా దుస్తులు విప్పడాల మధ్య ఉన్న తేడాను గుర్తించే టెక్నాలజీని పొందుపరిచారు. దీంతో బలవంతంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించినపుడు ఇంటిగ్రేటెడ్ బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా ఆప్తులకు సమాచారం చేరవేస్తుంది. ఒకవేళ 30 సెకన్లలోగా ఎలాంటి సహాయం అందకపోతే పెద్ద శబ్దం చేస్తూ దగ్గరలోని వారిని అప్రమత్తం చేస్తుందని మనీషా వెల్లడించింది.