: డ్రగ్స్ తో పనేంటి? ఇలా ఉండండి: అక్షయ్ కుమార్
డ్రగ్స్ వంటి చెడు అలవాట్ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తెలిపాడు. టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న అక్షయ్ కుమార్... టాలీవుడ్ లో రేగుతున్న డ్రగ్స్ దుమారంపై స్పందించాడు. డ్రగ్స్ ను కేవలం సినిమావాళ్లే తీసుకుంటారని అనడం సరైంది కాదని చెప్పాడు. అయితే సినిమా వాళ్లకు ఉన్న ఫేస్ వాల్యూతో మీడియా వారిని ప్రముఖంగా చూపిస్తుందని, అందువల్లే సినిమావాళ్లు లక్ష్యంగా మారుతున్నారని ఆయన చెప్పారు. డ్రగ్స్ ను స్పోర్ట్స్ మన్స్, పొలిటీషియన్స్, బ్యాంకర్స్ ఇలా వివిధ వృత్తులకు చెందినవారు తీసుకుంటారని ఆయన చెప్పారు.
అయితే అలాంటి వాటి వల్ల తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత నష్టాలు చాలా ఉంటాయని చెప్పాడు. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని ఆయన స్పష్టం చేశాడు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానం అవసరమని చెప్పాడు. తనవరకు తాను మంచి నియమాలు పాటిస్తానని అక్షయ్ తెలిపాడు. తన తల్లి చేసిన వంటకాలు తీసుకుంటానని చెప్పాడు. పొగతాగనని, ఆల్కహాల్ సేవించనని చెప్పాడు. కష్టపడి పనిచేస్తానని చెప్పాడు. ఆరోగ్యానికి హానికలిగించే పొగాకు పదార్థాలను వాడనని ఆయన స్పష్టం చేశాడు.