: గుజరాత్‌కు క్యారెట్ తినడం నేర్పింది ఈయనే!
గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఖాంద్రోల్ గ్రామానికి చెందిన 95 ఏళ్ల వల్లభభాయ్ వాసారాంభాయ్ మార్వనీయ 1943లో గుజరాత్ ప్రజలకి క్యారెట్ మనుషులు తినే కాయగూర అని పరిచయం చేశాడు. అప్పటివరకు దీన్ని పశువుల దానా కోసం మాత్రమే పండించేవారు. ఒకరోజు అనుకోకుండా క్యారెట్‌ను కొరికి చూసి, రుచిగా అనిపించడంతో వల్లభభాయ్ మార్కెట్‌కు తీసుకెళ్లాడు. అక్కడి వర్తకులు కూడా రుచిగా ఉందని, కొనడంతో క్యారెట్‌ను ఎక్కువ మొత్తంలో సాగు చేయడం మొదలు పెట్టాడు.
తర్వాత ఆ పంట సరిగా ఎదగడానికి, మంచి దిగుబడి రావడానికి చాలా పరీక్షలు చేసి ఒక కొత్త వంగడాన్ని కూడా కనిపెట్టాడు. దాని పేరు `మధువన్ గాజర్`. ఈ `మధువన్ గాజర్` మొక్కల మీదకి తుమ్మెదలు అధికంగా వస్తుండటం వల్ల ఈ పేరు పెట్టినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో ఎక్కువ దిగుబడినిస్తున్న క్యారెట్ వంగడం ఇదే అని తేల్చి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారు ఈ ఏడాది నేషనల్ గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్ అవార్డు అందజేశారు. ఈ అవార్డును ఆయన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు.