: వన్స్ అపాన్ ఏ టైమ్ ఓ మహారచయిత..
ఆయన 1979 మే 4న మరణించాడు.. అంటే సరిగ్గా ఇదే రోజు! ఆరోజు ఎవరూ ఆయన కోసం సాశ్రునేత్రాలు ప్రదర్శించలేదు.. కార్యాలయాలకు, పాఠశాలలకేమీ సెలవివ్వలేదు. ఆయన రాజకీయనాయకుడు కాదు, లోకం మెచ్చిన రచయిత అంతకన్నా కాదు. బతికి ఉన్నన్నాళ్ళూ పట్టించుకోని పత్రికలు, మరణం తర్వాత రోజున చిన్న కాలమ్ తో సరిపెట్టాయి. జాతీయ పత్రికలు సరేసరి!
ఇందరి నిర్లక్ష్యానికి గురవడానికి ఆయన చేసిన పాపమల్లా.. 'శృంగారంలో ఆడామగా ఇద్దరూ పాల్గొన్నపుడు వారిలో ఒకరు చెడిపోయేవారూ, మరొకరు చెరిపేవారు ఎలా అవుతారు?' అని.. ముఖ్యంగా స్త్రీని సంఘ బానిసగా పరిగణిస్తోన్న సమాజంపై, ఇదే తరహాలో కొన్ని వేల ప్రశ్నలు సంధించడమే. ఆయన ఒక్కొక్క రచన స్త్రీల విషయంలో సమాజాన్ని గుక్కతిప్పుకోనివ్వకుండా చేసింది. తన కలంతో లోకరీతులను ప్రశ్నించిన ధీరోదాత్తుడీయన. జవాబు చెప్పలేని ప్రభుత్వాలు, సమాజం, ప్రజలూ అందరూ ఆయన్ను వెలివేశారు.
ఎవరో కొందరు మిత్రులు.. చివరికి వారూ మొహం చాటేశారు. అత్యంత దయనీయ పరిస్థితుల నడుమ ఆంధ్ర రాష్ట్రాన్ని వీడి పరాయి రాష్ట్రం తమిళనాడు చేరి అరుణాచలంలో నివాసం ఏర్పరచుకోవాల్సిన దుస్థితి. మరోసారి తెలుగు గడ్డపై అడుగుపెట్టే సాహసం చేయని ఆ వ్యక్తి అక్కడే మరణించాడు. అతని పేరు చలం. అతని రచనలు అజరామరం!
మైదానం, బ్రాహ్మణీకం, శశిరేఖ, జీవితాదర్శం, దైవమిచ్చిన భార్య, ప్రేమ పర్యవసానం వంటి కథానికలు, నవలలే కాకుండా వినూత్న రీతిలో ఆలోచన స్రవంతికి అక్షర రూపమిచ్చిన మ్యూజింగ్స్.. వీటన్నింటిని మించి తనను పాలించి, ఊగించి, శాసించిన స్త్రీలోకానికి అంకితమా అన్నట్టుగా సంధించిన పుస్తకరాజం 'స్త్రీ' .. టాగోర్ గీతాంజలికి తెలుగు అనువాదం.. చివరగా తన ఆత్మకథ 'చలం'.. ఇవీ ఈ ప్రేమర్షిని మహారచయితగా నిలిపిన అక్షర ఆణిముత్యాలు.
ఓ పది తెల్లకాగితాలను నలుపు చేసినందుకే నేటి తరం రచయితలు అవార్డులు ఆశిస్తోండగా.. మరో వందేళ్ళు గడిచినా, సమాజానికి ప్రశ్నార్థకాలు మిగిల్చే అక్షరాస్త్రాలను సంధించిన చలానికి ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం నిజంగా దురదృష్టకరం. కనీసం మరణానంతరం ఆయన్ను పట్టించుకున్న పాపానపోలేదు ప్రభుత్వాలూ, సాహితీ సంఘాలు. చివరికి అరుణాచలంలోని ఆయన సమాధి కుక్కలకు ఆవాసమైనా ఎవరికీ పట్టలేదు. అంతగా కానివాడు అయ్యాడీ వేదాంతి.
కనీసం వర్థంతి రోజైనా ఆయన్ను మనం స్మరించుకోకపోతే మనల్ని మనం మరిచిపోయినట్టే. ఎందుకంటే, స్త్రీని జగన్మాతగా కొలిచే మన సమాజం.. వాస్తవంలో మహిళలను ఇప్పటికీ అణగదొక్కే ప్రయత్నం చేస్తూనే ఉంది. అలా నిరాదరణకు గురవుతున్న 'స్త్రీకి శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి, స్త్రీకి హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి, ఆ స్త్రీకి మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి' అంటూ దశాబ్దాల క్రితమే ఎలుగెత్తిన ఆ మహానీయుడికి మరొక్కసారి మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం.