: గ్రహాంతరవాసులం మనమేనట.. రీసర్చ్ లో వెల్లడవుతున్న అనూహ్య వివరాలు


మనుషులకు అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో 'ఏలియన్స్' ఒకటి. ఈ అనంత విశ్వంలో మనం మాత్రమే ఉన్నామా? లేక మరెక్కడైనా జీవ జాతి ఉందా? అనే అంశంపై మనకు అంతులేని ఆసక్తి ఉంది. ఫ్లయింగ్ సాసర్లు వచ్చాయని, ఏలియన్స్ ను చూశామని చెప్పేవారు కూడా లేకపోలేదు. ఇంటర్నెట్ లో వెతికితే ఏలియన్స్ పేరిట రకరకాల ఫొటోలు కూడా కనిపిస్తాయి. మరోవైపు శాస్త్రవేత్తలు కూడా గ్రహాంతరవాసుల కోసం ఎంతో కాలంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసుల కోసం వెతుకుతూనే ఉన్నారు.

అయితే, మనమే గ్రహాంతరవాసులం అనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మనం కూడా గ్రహాంతరవాసులమనే చెబుతున్నారు. మన గెలాక్సీ నుంచి కాకుండా... సూదూరంగా ఉన్న గెలాక్సీల నుంచి గెలాక్టిక్ వాయువులు తోసుకొచ్చిన పదార్థాలతో మనం తయారయ్యామని వారు చెబుతున్నారు. పాలపుంతల్లోని పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్స్ ఆధారంగా వారు రీసర్చ్ చేయగా... అనూహ్యమైన వివరాలు వెల్లడయ్యాయి. సూపర్ నోవా పేలుళ్లు జరిగినప్పుడు పాలపుంతలు, నక్షత్ర మండలాల నుంచి నుంచి విస్తారమైన వాయువులు బలంగా వెలువడతాయని... ఈ గెలాక్టిక్ వాయువులు అణువులను ఒక గెలాక్సీ నుంచి మరో గెలాక్సీకి నెట్టబడతాయనే విషయం వీరి రీసర్చ్ లో బయటపడింది.

మన సౌరవ్యవస్థలో, భూమి మీద ఉన్న మనలో, మన చుట్టూ ఉన్న వాతావరణంలోని అణువుల్లో సగభాగం 10 లక్షల కాంతి సంవత్సరాల అవతల ఉన్న గెలాక్సీల నుంచి వచ్చినవే అని శాస్త్రవేత్తలు తెలిపారు. మనల్ని మనం రోదసి యాత్రికులుగా చెప్పుకోవచ్చని... వేరే గెలాక్సీ నుంచి వచ్చిన గ్రహాంతరవాసులుగా భావించుకోవచ్చని చెప్పారు.

  • Loading...

More Telugu News