: సైనిక పాలనా?... మరో ప్రధానా?... పాక్ పై ఒక్కసారిగా పెరిగిన ఆసక్తి!
పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తప్పనిసరిగా ప్రధాని పదవికి రాజీనామా చేసి, కోర్టు విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలోకి నవాజ్ షరీఫ్ నెట్టివేయబడగా, తదుపరి దేశ భవిష్యత్తు ఏంటన్న విషయమై ఆసక్తి నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తూ, పీఎంఎల్-ఎన్ పార్టీకి చెందిన మరో వ్యక్తిని ప్రధానిగా నియమిస్తారా? లేక పాలనను సైన్యం తన అధీనంలోకి తీసుకుంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం అధికార పీఎంఎల్-ఎన్ లో షరీఫ్ కు దీటైన నాయకుడు మరొకరు లేకపోవడం అతిపెద్ద లోటుగా నిలిచింది. ఆయన కుమార్తె మర్యామ్ నవాజ్ ఇప్పటివరకూ పెద్దగా ప్రజా జీవితంలో, క్రియాశీల రాజకీయాల్లో లేకపోగా, సోదరుడు షహబాజ్ షరీఫ్ పంజాబ్ ప్రావిన్స్ కు మాత్రమే పరిమితమై ఉన్నారు. ఆయనకు ఒక్క ప్రావిన్షియల్ స్థానం మాత్రమే ఉండటంతో ప్రధాని పదవిని ఇప్పటికిప్పుడు స్వీకరించే వీలు లేదని తెలుస్తోంది. తొలుత తనకు అనుయాయుడు, రక్షణ మంత్రి అయిన ఖావాజా ఆసిఫ్ ను తాత్కాలిక ప్రధానిగా నియమించి, ఆపై సోదరుడిని ప్రధానిగా చేసేందుకు నవాజ్ ఎత్తులు వేయవచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇదంతా సైన్యం ముందడుగు వేయకుంటేనే జరుగుతుంది.
కాగా, ఇప్పటివరకూ నవాజ్ షరీఫ్ మూడు సార్లు పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగా, ఏ ఒక్కసారి కూడా పూర్తి కాలం పదవిలో లేరు. 1993లో ఆయనపై లంచాల ఆరోపణలు రాగా తొలిసారి ప్రధానిగా తొలగించబడ్డారు. ఆపై 1999లో సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్, నవాజ్ నుంచి అధికారాన్ని లాక్కొన్నారు. ఆపై ఇప్పుడు మూడోసారి ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోకుండానే తొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది.