: చంద్రబాబు, కేసీఆర్ లు ప్రత్యర్థులు మాత్రమే.. శత్రువులు కాదు: వెంకయ్యనాయుడు
ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు సమన్వయంతో పని చేసుకుంటూ, రెండు రాష్ట్రాలను ప్రగతిపథంలో నడిపించాలనేదే తన కోరిక అని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు తెలిపారు. తన కోరికను ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించారని చెప్పారు. చంద్రబాబు, కేసీఆర్ లు రాజకీయపరంగా ప్రత్యర్థులే కాని, శత్రువులు కాదని అన్నారు. హైదరాబాద్ లోని ఇమేజ్ గార్డెన్స్ లో తనకు ఏర్పాటు చేసిన ఆత్మీయసభలో ఆయన ప్రసంగిస్తూ, ఈ వ్యాఖ్యలు చేశారు. జీవితమంతా రాజకీయాల్లోనే గడిపిన తనకు కుటుంబం నుంచి ఎలాంటి ఒత్తిడి ఎదురుకాలేదని చెప్పారు. పిల్లలు కూడా తనపై ఆధారపడకుండా, వారి కెరియర్ ను వారే నిర్మించుకున్నారని తెలిపారు. తన పదవులను అడ్డం పెట్టుకుని ఎదిగే ప్రయత్నాన్ని వారు చేయలేదని అన్నారు.